కర్నూలు : కర్నూలు నగర పరిధిలోని అనధికార లేఅవుట్లు మరియు అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణపై నగర కమిషనర్ పి.విశ్వనాథ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. లేఅవుట్ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌యస్) మరియు భవన నిర్మాణ క్రమబద్ధీకరణ (బిపియస్) పథకాల పురోగతిపై పట్టణ ప్రణాళిక విభాగంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఈ పథకాలను ప్రవేశపెట్టిందని, వీటి అమలులో సిబ్బంది ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, తాను స్వయంగా క్షేత్రస్థాయిలో అకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.
బిపియస్ పథకం గడువు వచ్చే నెల 11వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, అధికారులు తమ పనితీరును వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో సుమారు 20 వేల అనధికార నిర్మాణాలను గుర్తించగా, ఇప్పటివరకు కేవలం 9 వేల నోటీసులు మాత్రమే జారీ చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. మిగిలిన 11 వేల నోటీసులను వెంటనే జారీ చేయాలని, గుర్తించిన అక్రమ కట్టడాలపై ఎరుపు రంగు పెయింట్‌తో "బిపియస్-2025" అని స్పష్టంగా మార్క్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఎక్కడైనా నోటీసులు ఇవ్వడంలో అలసత్వం కనిపిస్తే సంబంధిత ప్లానింగ్ కార్యదర్శి మరియు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను బాధ్యులను చేస్తామన్నారు.
నగర ఆదాయం మరియు అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ఎల్‌ఆర్‌యస్ ద్వారా ఇప్పటివరకు రూ. 11.84 కోట్లు, బిపియస్ ద్వారా రూ. 1.92 కోట్ల నిధులు జమ అయ్యాయని కమిషనర్ వెల్లడించారు. నగర పరిధిలో ఇంకా 360కి పైగా అనధికార లేఅవుట్లు ఉన్నాయని, వాటిలో మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవాలని, లేనిపక్షంలో గడువు తీరిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Leave a Reply